ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ ఓట‌మి.. ప్లేఆఫ్స్‌కు గుజ‌రాత్ టైటాన్స్

  • నిన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ, జీటీ మ్యాచ్‌
  • ఢిల్లీని 10 వికెట్ల తేడాతో ఓడించిన గుజ‌రాత్‌
  • సాయి సుద‌ర్శ‌న్‌ సూపర్ శ‌త‌కం
  • కేఎల్‌ రాహుల్ సెంచ‌రీ వృథా
  • ఈ విజ‌యంతో ప్లేఆఫ్స్‌కు టైటాన్స్‌
  • ఢిల్లీ ఓట‌మితో ఆర్‌సీబీ, పీబీకేఎస్ కూడా ప్లేఆఫ్స్‌కు
ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) 10 వికెట్ల తేడాతో సూప‌ర్ విక్ట‌రీతో ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలిజ‌ట్టుగా నిలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 200 పరుగుల ల‌క్ష్యాన్ని టైటాన్స్‌ 19 ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్ అజేయ‌ శ‌త‌కానికి (61 బంతుల్లో 108 నాటౌట్‌) తోడు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 93 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టు ఘనవిజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా ప‌డ‌గొట్ట‌లేకపోయారు. 

అటు మొదట బ్యాటింగ్‌ చేసిన డీసీ స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్ అజేయ సెంచ‌రీ (65 బంతుల్లో 112 నాటౌట్‌)తో రాణించాడు. దీంతో నిర్ణీత‌ 20 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌.. తొలి 18 బంతుల్లో కేవ‌లం 17 పరుగులే చేశాడు. ఆ తర్వాత కాస్త గేర్ మార్చాడు. మూడో ఓవర్‌లోనే స్టార్ ప్లేయ‌ర్‌ డుప్లెసిస్‌ (5) నిష్క్రమించడంతో రాహుల్‌ ఆచితూచి ఆడాడు. 

సిరాజ్‌ 5వ ఓవర్లో రెండు వ‌రుస బౌండరీలు బాదిన అతడు.. రబాడా 6వ ఓవర్లో 6, 4, 6తో పంథా మార్చాడు. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తయ్యాక రాహుల్‌ పూర్తిస్థాయిలో జోరు పెంచాడు. ఫిఫ్టీ నుంచి 90లలోకి రావడానికి రాహుల్‌ తీసుకున్న బంతులు 16 మాత్రమే. ప్రసిద్ధ్‌ 19వ ఓవర్లో 6, 4తో 60 బంతుల్లో ఈ ఢిల్లీ ఓపెనర్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 

ఐపీఎల్‌లో అతడికి ఇది ఐదో సెంచరీ కాగా మూడు ఫ్రాంచైజీల (పంజాబ్‌, లక్నో, ఢిల్లీ) తరఫున ఆడుతూ సెంచ‌రీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. చివ‌రికి 65 బంతుల్లో 112 ప‌రుగులు చేసి, నాటౌట్ గా ఉన్నాడు. అత‌ని ఈ అజేయ‌ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసిన డీసీ.. జీటీకి 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

ఇక‌, ఛేదనలో గుజరాత్‌ ఆరంభం నుంచే లక్ష్యం దిశగా సాగింది. ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్ వేసిన తొలి ఓవర్లోనే పది పరుగులు రాగా, నటరాజన్ రెండో ఓవర్లో సుదర్శన్‌ నాలుగు బౌండరీలు బాద‌డంతో ఆ ఓవర్లో 20 రన్స్‌ వచ్చాయి. మరో ఎండ్‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్‌ గిల్‌.. మొద‌ట క్రీజులో కుదురుకునేందుకు కాస్త‌ స‌మ‌యం తీసుకున్నాడు. దాంతో నెమ్మదిగా ఆడాడు. 

అక్షర్‌ 9వ ఓవర్లో బౌండరీతో సుదర్శన్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో గిల్ ఓ సిక్సర్ బాదాడు. ఆ త‌ర్వాత చమీర ఓవర్లో బౌండరీతో గిల్‌ కూడా అర్థ శ‌త‌కం సాధించాడు. ఇద్దరూ అర్ధ శతకాల తర్వాత బౌండరీలు, సిక్సర్ల మోత మోగించారు. కుల్దీప్ యాద‌వ్‌ 18వ ఓవర్లో సిక్సర్‌తో సాయి సుద‌ర్శ‌న్‌... ఐపీఎల్‌లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. ఆఖ‌రికి టైటాన్స్ 19 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా ల‌క్ష్యాన్ని ఛేదించింది. 

ఈ విజ‌యంతో గుజ‌రాత్ ప్లేఆఫ్స్ బెర్త్ కూడా క‌న్ఫార్మ్ చేసుకుంది. అలాగే ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా నిలిచింది. ఇక‌, ఢిల్లీ ఓట‌మితో గుజ‌రాత్‌తో పాటు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) కూడా ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి.  


More Telugu News