హైదరాబాద్‌లో భారీ పేలుడు కుట్ర భగ్నం.. ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్!

  • తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • సిరాజ్, సమీర్ అనే ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
  • సౌదీ అరేబియాలోని ఐసిస్ మాడ్యూల్ నుంచి ఆదేశాలు
  • విజయనగరంలో పేలుడు పదార్థాలు సేకరించినట్టు గుర్తింపు
హైదరాబాద్‌లో జరగాల్సిన ఓ భారీ పేలుడు కుట్రను పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది.

హైదరాబాద్‌లో డమ్మీ పేలుడుకు పాల్పడేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగాలు రంగంలోకి దిగాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ వాసి సమీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్ మాడ్యూల్ నుంచి ఆదేశాలు అందుకుంటున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం కుట్రలో భాగంగా సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలను సేకరించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో దాడులు నిర్వహించేందుకు వీరు పథకం రచించారు. నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? వీరి ప్రణాళికలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఉమ్మడి ఆపరేషన్ ద్వారా పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.


More Telugu News