'నోట్ బుక్' బౌలర్ తో గొడవపై అభిషేక్ శర్మ ఏమన్నాడంటే...!

  • లక్నో బౌలర్ దిగ్వేశ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ అభిషేక్ శర్మ వాగ్వాదం
  • అభిషేక్ ఔటయ్యాక దూకుడుగా రాఠి  నోట్ బుక్ సంబరాలు, మాటల తూటాలు
  • మ్యాచ్ తర్వాత దిగ్వేశ్‌తో మాట్లాడానన్న అభిషేక్
  • ఇప్పుడంతా సర్దుకుందని, అంతా సవ్యంగానే ఉందని వెల్లడి
ఐపీఎల్ సీజన్‌లో సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ, లక్నో బౌలర్ దిగ్వేశ్ రాఠి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ స్పందించారు. ప్రస్తుతం అంతా సర్దుమణిగిందని, తామిద్దరం కూల్ అయ్యామని ఆయన తెలిపారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ఆట తర్వాత అంతా సర్దుకుంది: అభిషేక్

దిగ్వేశ్ రాఠితో జరిగిన వాగ్వాదం గురించి అభిషేక్ శర్మ మాట్లాడుతూ, "గేమ్ ముగిసిన తర్వాత నేను అతనితో (దిగ్వేశ్‌తో) మాట్లాడాను. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. అంతా సవ్యంగానే ఉంది. మేం కూల్ అయ్యాం" అని వివరించారు. మ్యాచ్ ముగిశాక వీరిద్దరూ కరచాలనం చేసుకోవడం గమనార్హం.

అసలేం జరిగింది?

ఈ సీజన్‌లో తన సంబరాల శైలితో లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. పలుమార్లు జరిమానా కూడా ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇది పునరావృతమైంది. హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో, మెరుపు షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడిన అభిషేక్ శర్మను ఎనిమిదో ఓవర్లో దిగ్వేశ్ రాఠి ఔట్ చేశాడు. అనంతరం, తనదైన శైలిలో 'నోట్‌బుక్' సంబరాలు చేసుకున్నాడు. అయితే, పెవిలియన్‌కు వెళుతున్న అభిషేక్ శర్మ, రాఠిని చూస్తూ ఏదో వ్యాఖ్యానించినట్లు కనిపించింది. దీంతో దిగ్వేశ్ రాఠి ఆగ్రహంతో అభిషేక్ వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్ కల్పించుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేసి, అభిషేక్‌ను పెవిలియన్‌కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


More Telugu News