షైనింగ్ స్టార్స్ ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

  • పదో తరగతి టాపర్లను సత్కరించిన మంత్రి లోకేశ్ 
  • స్కూల్ డేస్‌లో తను చివరి బెంచ్, అల్లరి బ్యాచ్ అని చెప్పిన మంత్రి లోకేశ్ 
  • స్కూల్ పరీక్షలు ఎంత కష్టమో, అసెంబ్లీలో సమాధానాలు ఇవ్వడమూ అంతే కష్టమేనన్న మంత్రి లోకేశ్
పాఠశాల రోజుల్లో తాను లాస్ట్ బెంచ్ విద్యార్థినని, అల్లరి బ్యాచ్‌లో ఉండేవాడినని మంత్రి నారా లోకేశ్ విద్యార్థుల వద్ద చెప్పుకొచ్చారు. షైనింగ్ స్టార్స్ పేరుతో పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖులు రచించిన తొమ్మిది రకాల పుస్తకాలను వారికి కానుకగా బహుకరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సరదాగా సమాధానాలు ఇచ్చారు. మీరు చదువుకునే సమయంలో పాఠశాలలో పరీక్షలు కష్టంగా ఉండేవో, ఇప్పుడు అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టంగా ఉన్నాయో అని సంతోష్ అనే విద్యార్థి ప్రశ్నించగా, రెండూ కష్టమైనవేనని అన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఎంతో ప్రిపేర్ కావాల్సి వచ్చిందన్నారు.

మీరు అదృష్టాన్ని నమ్ముతారా, లేక కష్టాన్ని నమ్ముతారా అని మరో విద్యార్థి ప్రశ్నించగా, ఉన్నత స్థానాలకు ఎదగాలంటే కష్టానికి మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. తాను మోదీ, చంద్రబాబు నుంచి రాజకీయాల్లో ప్రేరణ పొందానని లోకేశ్ పేర్కొన్నారు. తాను స్కూల్ డేస్‌లో చివరి బెంచీలో కూర్చోవడం, అల్లరి చేయడం వంటివి చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వివరించారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు పలు సూచనలు చేశారు. 


More Telugu News