చిరంజీవి-అనిల్ రావిపూడి 'మెగా 157' షూటింగ్ షురూ

  • చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మెగా 157'
  • శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ 
  • చిరుతో పాటు ఇత‌ర న‌టీన‌టుల‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌
మెగాస్టార్‌ చిరంజీవి, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న 'మెగా 157' సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత షూటింగ్ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. చిరుతో పాటు ఇత‌ర న‌టీన‌టుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్లు స‌మాచారం.  

ఇక‌, మొదటి షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర కీలక తారాగణం సభ్యులు పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ని స‌మాచారం. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే మేక‌ర్స్ ఈ భారీ ప్రాజెక్టులో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్లు ఓ ప్ర‌త్యేక వీడియో ద్వారా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

'సరిలేరు నీకెవ్వరు', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి వ‌రుస‌ హిట్ చిత్రాలు అందించిన‌ దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీని 'మెగా 157'కి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండ‌గా... షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

కాగా, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఇప్ప‌టికే 'విశ్వంభ‌ర‌'ను పూర్తి చేసిన మెగాస్టార్‌... అనిల్ రావిపూడి మూవీ త‌ర్వాత ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలాతో మ‌రో సినిమా చేయ‌నున్నారు.  


More Telugu News