అలా సినిమాలు చేయడం నాకు ఏ మాత్రం నచ్చదు: మణిరత్నం

  • గతంలో సినిమాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరించేవన్న  మణిరత్నం
  • ఇప్పుడంతా వ్యాపార కోణంలో చూస్తున్నారని వ్యాఖ్య
  • బాక్సాఫీస్ వద్ద నంబర్ల కోసమే సినిమాలు చేయడం నచ్చదన్న మణిరత్నం 
భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రముఖ దర్శకుడు మణిరత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ హీరోగా రూపొందిన మూవీ 'థగ్ లైఫ్' ప్రమోషన్స్‌లో భాగంగా మణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దక్షిణాదిలోని కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం వంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్నప్పటికీ మనం వెయ్యి కోట్ల (బాక్సాఫీస్ కలెక్షన్స్) సినిమాలు ఎందుకు చేయడం లేదని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనిపై మణిరత్నం సమాధానమిస్తూ, భారీ కలెక్షన్స్ రాబట్టే సినిమాలు చేయడం ముఖ్యమా? లేక ప్రేక్షకుల మనసుకు హత్తుకునే సినిమాలు చేయడం ముఖ్యమా? అని ఒక్కసారి ఆలోచించాలని అన్నారు.

గతంలో సినిమాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరించేవని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు. సినిమాలో కొన్ని అంశాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతున్నాయన్నారు. అంతేకాకుండా అప్పట్లో ఏదైనా సినిమా విడుదలైతే ప్రేక్షకులు అందులో ఉన్న అంశాలు ఏమిటి? దానిని ఎలా తెరకెక్కించారు? అనే దానిపై దృష్టి పెట్టేవారని, ఇప్పుడు అలా లేదన్నారు.

ఇప్పుడు అంతా వ్యాపార కోణంతోనే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సినిమా క్వాలిటీ దెబ్బతినే విధంగా ఇది మారకూడదని భావిస్తున్నానన్నారు. బాక్సాఫీస్ వద్ద నంబర్ల కోసమే సినిమాలు చేయడం తనకు ఏమాత్రం నచ్చదని మణిరత్నం పేర్కొన్నారు. 


More Telugu News