మాజీ మంత్రి కాకాణికి 14 రోజుల రిమాండ్

  • అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి రిమాండ్
  • రిమాండ్ విధించిన వెంకటగిరి కోర్టు
  • కాకాణిని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడం, దాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక గిరిజనులను బెదిరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు పేర్కొన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

కాకాణి గోవర్ధన్‌రెడ్డిని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ ఉదయం ఆయన్ను నెల్లూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ వెంకటగిరి కోర్టుకు తరలించారు. మొత్తం తొమ్మిది పోలీసు వాహనాల కాన్వాయ్‌తో, ప్రత్యేక పోలీసు బలగాల పహారాలో ఆయనను వెంకటగిరికి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కాకాణికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. 


More Telugu News