రాజ్య‌స‌భ‌కు క‌మ‌ల్ హాస‌న్‌

  • 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఎంఎన్‌ఎంకు రాజ్య‌స‌భ సీటు 
  • కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డీఎంకే బుధవారం ప్రకటన
  • రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు
  • ఇందులో తమిళనాడు నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల సమ‌యంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఎంఎన్‌ఎంకు రాజ్య‌స‌భ సీటు కేటాయించారు. ఇందులో భాగంగా కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో ఈ స్థాయిలో డీఎంకేకు 134 మంది శాసనసభ్యులు ఉన్న నేపథ్యంలో ఆరు సీట్లలో నాలుగు డీఎంకేకు, మిగిలిన రెండు అన్నాడీఎంకేకు దక్కే అవకాశాలు ఏన్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం డీఎంకే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కమల్ కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విల్సన్, ప్రఖ్యాత రచయిత సల్మా, ఎస్.ఆర్. శివలింగం. 
దీంతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పవచ్చు.

2024 లోక్‌సభ ఎన్నికలలో డీఎంకే - ఎంఎన్‌ఎం మధ్య అంగీకారం
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ తన పార్టీ ఎంఎన్‌ఎం ద్వారా ఇండియా కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎంకే - ఎంఎన్‌ఎం మధ్య ఒక అంగీకారం జరిగినట్లు తమిళ మీడియా కథనాలు వెల్లడించాయి. కమల్ హాసన్‌కు 'లోక్‌సభకు పోటీ చేయాలా? లేక రాజ్యసభకు వెళ్లాలా?' అనే ఎంపికను డీఎంకే ఇచ్చినట్లు సమాచారం. చివరికి కమల్ రాజ్యసభ వైపు మొగ్గు చూపినట్లు ఆ కథనాల ప్రకారం తెలుస్తోంది.

2018లో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపన 
కమల్ హాసన్ 2018, ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, అప్పటి నుంచి ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం మాత్రం చూపలేకపోయింది. ఇక‌, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ పోటీ చేసినా, విజయం దక్కలేదు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 3.72 శాతం ఓట్ల వాటా సాధించింది.


More Telugu News