థియేట‌ర్ల బంద్ చిన్న విష‌యం కాదు.. ఎవ‌రో మిస్ గైడ్ చేశారు: రాజేంద్ర‌ప్ర‌సాద్‌

  • ష‌ష్టిపూర్తి చిత్రం ప్రీరిలీజ్ వేడుక‌లో థియేట‌ర్ల బంద్ అంశంపై స్పందించిన నటకిరిటీ
  • ఎవ‌రో త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మిస్ గైడ్ చేశార‌న్న సీనియ‌ర్ న‌టుడు
  • ఇలాంటివి సృష్టించిన వారిని క‌నిపెడితే స‌మ‌స్య‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుందని వ్యాఖ్య
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ తాజా పరిణామాలపై స్పందించారు. థియేట‌ర్ల బంద్ అనేది చిన్న విష‌యం కాద‌న్నారు. ఎవ‌రో త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మిస్ గైడ్ చేశార‌ని అన్నారు. ఈ మేర‌కు త‌న తాజాగా చిత్రం 'ష‌ష్టిపూర్తి' ప్రీరిలీజ్ వేడుక‌లో ఈ అంశంపై స్పందించారు. మే 30న ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మేక‌ర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ... "థియేట‌ర్లు మూసేయ‌డం అనేది ఒక‌రు చెబితే చేసేది కాదు. అది సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణ‌యం. ఎవ‌రో కావాల‌నే వార్త‌ల‌ను సృష్టించి మిస్ గైడ్ చేశారు. చివ‌రకు అది నిల‌బ‌డ‌లేదు క‌దా. ఇలాంటివి సృష్టించిన వారిని క‌నిపెడితే ఈ స‌మ‌స్య‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుంది. థియేట‌ర్ల‌ను బంద్ చేస్తామ‌నే మాట చిన్న‌ది కాదు. ఇలాంటివి ఇంకెప్పుడూ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యంలో బాధ్య‌త తీసుకుని దీని వెనుక ఎవ‌రున్నారో క‌నిపెట్టాల‌ని కోర‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. 

ఇక‌, నేను ఎప్పుడూ డ‌బ్బు సంపాద‌న కోసం సినిమాలు చేయ‌లేదు. ఒక‌వేళ నేను సంపాదించిన డ‌బ్బును కొంద‌రు హీరోలు పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు పెట్టి ఉంటే ఈపాటికి హైద‌రాబాద్‌, మ‌ద్రాసుల‌లో వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉండేవి. నేను సంపాద‌న గురించి ప‌ట్టించుకోకుండా కేవ‌లం మంచి సినిమాలు చేశాను. ప‌వ‌న్ క‌ల్యాణ్ నాకు త‌మ్ముడితో స‌మానం. కానీ, ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న సినిమాల్లో న‌టించ‌డం ఎందుకో కుద‌ర్లేదు. త్వ‌ర‌లోనే ఆ అవ‌కాశం రావాల‌ని కోరుకుంటున్నాను" అని అన్నారు. 

కాగా, అప్ప‌టి సూప‌ర్ హిట్ సినిమా 'లేడీస్ టైల‌ర్' విడుద‌లైన‌ 38 ఏళ్ల త‌ర్వాత రాజేంద్ర‌ప్ర‌సాద్‌, అర్చ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'ష‌ష్టిపూర్తి'. ప‌వ‌న్ ప్ర‌భ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో రూపేశ్‌, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.    


More Telugu News