ఆమెను విడుదల చేయకపోతే బెంగాల్ మరో ఉత్తర కొరియా అవుతుంది: కంగనా

  • సోషల్ మీడియా పోస్ట్ కేసులో శర్మిష్ఠ పనోలీ అరెస్ట్
  • ఇది అన్యాయమన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్
  • పశ్చిమ బెంగాల్‌ను ఉత్తర కొరియాలా మార్చొద్దని హితవు
  • మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని శర్మిష్ఠపై కేసు
సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వ్యవహారంలో కోల్ కతా విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అరెస్ట్ కావడాన్ని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు. ఇది అన్యాయమని, ఉత్తర కొరియా తరహా నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు షర్మిష్ఠకు మద్దతుగా నిలిచారు.

ఢిల్లీలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ఠను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఆమె కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని కంగనా ఆందోళన వ్యక్తం చేశారు. "ఏ అమ్మాయికి లేదా ఇలాంటి నిర్బంధం ఎదురుకాకూడదు" అని ఆమె అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ ప్రభుత్వంపై కంగనా విమర్శలు గుప్పించారు. "పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మరో ఉత్తర కొరియాగా మార్చవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను" అని కంగనా పేర్కొన్నారు. "ప్రతి పౌరుడికీ ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి. ఒకవేళ ఆమె ఏదైనా అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసి ఉంటే, దానికి తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఆమె సాధారణ సందర్భంలోనే ఆ వ్యాఖ్య చేసినట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో యువత ఇలాంటి భాషను సాధారణంగానే వాడుతున్నారు" అంటూ కంగనా వివరించారు.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో మతపరమైన వ్యాఖ్యలున్న వీడియోలను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై 22 ఏళ్ల శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు నిన్న హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత శర్మిష్ఠ ఆ వీడియోను తొలగించి, బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. మే 15న గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మతప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా మత మనోభావాలను దెబ్బతీయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి అభియోగాలను భారతీయ న్యాయ సంహిత కింద చేర్చారు. అరెస్ట్ అనంతరం శర్మిష్ఠను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.


More Telugu News