ఈసారి ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఎంత?

  • ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం
  • ఈ సమావేశంలో రేపో రేటు 50 శాతం బేసిక్ పాయింట్లు కట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న ఎస్బీఐ 
  • ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు వంద బేసిక్ పాయింట్లకు చేరుకోవచ్చనేది ఎస్బీఐ అంచనా 
గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించి ఆర్బీఐ వ్యవస్థలో లిక్విడిటీని పెంచగా, మరోసారి రెపో రేటును తగ్గించేలా ద్రవ్య విధాన సమావేశంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రెపో రేటు 50 శాతం బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.

బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం మిగులు లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటోందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థల సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30 -70 బేసిక్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.

జూన్ పాలసీ సమావేశంలో 50 బేసిక్ పాయింట్ల రేటు కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు వంద బేసిక్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిబంధనల మేరకే ఉన్నాయని తెలిపింది. 


More Telugu News