పహల్గామ్ దాడి బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు: జైరాం రమేశ్

  • రేపు కశ్మీర్‌కు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్నారని జైరామ్ రమేశ్ వ్యాఖ్య
  • 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇంతవరకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో పోస్ట్ ద్వారా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జాతీయ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి దోషులను ఇంకా పట్టుకోలేదని విమర్శించారు. ఆ ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి చినాబ్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసేందుకు శుక్రవారం కశ్మీర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో జైరామ్ రమేశ్ 'ఎక్స్' వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రమూక 2023 డిసెంబర్‌లో పూంచ్‌లో, 2024 అక్టోబర్‌లో గుల్‌మార్గ్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. పహల్గామ్‌లో అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News