'హనీమూన్'లో భర్త హత్య.. భార్య తీరుపై తీవ్రంగా స్పందించిన కంగనా రనౌత్

  • మేఘాలయ హనీమూన్ హత్య కేసులో భార్యే ప్రధాన సూత్రధారి
  • భర్త రాజా రఘువంశీ హత్యకు నవవధువు సోనమ్ ప్లాన్
  • ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల అనుమానం
  • ఈ ఘటనపై ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో స్పందన
  • మూర్ఖులు సమాజానికి అత్యంత ప్రమాదకరమని కంగనా వ్యాఖ్య
మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నవవధువే తన భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిందన్న ఆరోపణలు రావడంతో పోలీసులు భార్య సోనమ్‌‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనపై ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. నిందితురాలి చర్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేశారు.

ఆమె సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, "ఇది ఎంతటి అవివేక చర్య! కన్న తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి భయపడిన ఒక మహిళ, ఇంత క్రూరమైన హత్యకు పథకం వేసి సుపారీ ఇవ్వగలదా? ఉదయం నుంచి ఈ విషయం నా మనసును కలచివేస్తోంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు, తలనొప్పిగా ఉంది" అని అన్నారు.

"ఆమె విడాకులు తీసుకోలేకపోయింది, తన ప్రేమికుడితో పారిపోనూలేకపోయింది. ఎంత హేయమైన ప్రవర్తన ఇది. మూర్ఖులను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారేమో కానీ, తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడతారో ఊహించలేం. దయచేసి జాగ్రత్తగా ఉండండి" అంటూ కంగనా తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News