బెంగళూరు తొక్కిసలాట ఘటనపై రాహుల్ ద్రవిడ్ స్పందన

  • క్రీడలను ఎంతగానో ప్రేమించే నగరం బెంగళూరు అన్న రాహుల్ ద్రవిడ్ 
  • ఇటువంటి నగరంలో ఇంత దారుణం జరగడం దురదృష్టకమని వ్యాఖ్య
  • చిన్నస్వామి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందన్న రాహుల్ ద్రవిడ్ 
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. ఆ తొక్కిసలాట దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తమ అభిమాన జట్టు విక్టరీ పరేడ్‌ను చూద్దామని వచ్చిన అభిమానులు మరణించడం తన మనసును కలచివేస్తోందని అన్నారు.

క్రీడలను ఎంతో ప్రేమించే నగరం బెంగళూరు అని, తాను అక్కడి నుంచే వచ్చానని ద్రవిడ్ అన్నారు. అక్కడి ప్రజలు క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని ఆటలను ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఫుట్‌బాల్ జట్టు అయినా, కబడ్డీ జట్టు అయినా ఎంతో మద్దతు ఇస్తారని తెలిపారు. ఆర్సీబీకి ఎంతోమంది అభిమానులున్నారని, ఆ జట్టు చాలా పాప్యులర్ అని అన్నారు. అలాంటి నగరంలో ఇంతటి దారుణం జరగడం దురదృష్టకరమని, తొక్కిసలాట విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ద్రవిడ్ వెల్లడించారు.

మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించినప్పటికీ, ఆయన చిన్నతనంలోనే వారి కుటుంబం బెంగళూరుకు వలస వచ్చింది. దీంతో ఆయన అక్కడే పెరిగాడు. ద్రవిడ్ దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అందుకే ఆయనకు బెంగళూరు అంటే ప్రత్యేక అభిమానం. అంతేకాకుండా, ఐపీఎల్ ఆరంభంలో ద్రవిడ్ ఆర్సీబీకి ఆడాడు. ప్రస్తుతం ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. 


More Telugu News