విమానం కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విమానం కూలిపోయిన వైనం
  • 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానం
  • ప్రమాద స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రామ్మోహన్ నాయుడు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు, కళ్లారా చూసిన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండి సహాయక, పునరావాస కార్యక్రమాలను తాను నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

"అహ్మదాబాద్‌లోని ప్రమాద స్థలాన్ని ఇప్పుడే సందర్శించాను. అక్కడ నేను చూసినవి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. నేను ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నాను" అని మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎయిర్ ఇండియా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు స్థానిక పరిపాలనా యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తున్నాయని మంత్రి వివరించారు.

ఈ విషాద సమయంలో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా నిలవడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. "ఈ కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలవడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


More Telugu News