అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. రెండుసార్లు టికెట్ క్యాన్సిల్ చేసుకున్న విజయ్ రూపానీ

  • విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణం
  • లండన్ ప్రయాణాన్ని గతంలో రెండుసార్లు రద్దు చేసుకున్న రూపానీ
  • మూడో ప్రయత్నంలో మృత్యువు కబళించిన వైనం
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. లండన్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆయన చేసిన ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. అయితే, ఈ ప్రయాణానికి ముందే ఆయన రెండుసార్లు టికెట్లు బుక్ చేసుకుని రద్దు చేసుకున్నారు.

విజయ్ రూపానీ తన భార్యతో కలిసి మే నెలలోనే లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా 171 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని, తన భార్యను మాత్రం లండన్ పంపించారు. ఆ తర్వాత, జూన్ 5న మరోసారి లండన్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, ఆ ప్రయాణం కూడా రద్దయింది. బీజేపీ పంజాబ్ ఇన్‌ఛార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రూపానీ, లుధియానాలో జరగాల్సిన ఉపఎన్నిక పనుల కారణంగానే తన ప్రయాణాలను రెండుసార్లు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

చివరకు జూన్ 12న లండన్‌కు బయలుదేరిన ఆయన, గమ్యం చేరకుండానే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విజయ్ రూపానీ '1206' అనే సంఖ్యను తన అదృష్ట సంఖ్యగా భావించేవారని, జూన్ 12 (12-06) తేదీనే ఆయన మరణించడం యాదృచ్ఛికమని, ఆయన వ్యక్తిగత వాహనాలకు కూడా ఇదే నంబర్ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


More Telugu News