ఈ ఏడుగురు వెరీ లక్కీ... ఆ రోజున విమానం ఎక్కకుండా బతికిపోయారు!

  • ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం నుంచి ఏడుగురు సురక్షితం
  • తల్లి కోరిక, పత్రాల సమస్యలతో కొందరికి విమానం మిస్
  • ట్రాఫిక్ జామ్, మనసులో ఆందోళన మరికొందరిని ఆపాయి
  • అనుకోని అవాంతరాలే ప్రాణాలు కాపాడాయని బాధితుల వెల్లడి
  • జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కూలిన వైనం
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రాణాలతో బయటపడ్డవారి కథనాలు
జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 (బోయింగ్ డ్రీమ్‌లైనర్) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపగా, ఏడుగురు వ్యక్తులు మాత్రం అదృష్టవశాత్తూ ఆ విమానం ఎక్కకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మొదట ప్రయాణం రద్దయినందుకు తీవ్ర నిరాశకు గురైన వారే, ఇప్పుడు ఆ అనుకోని అవాంతరాలే తమను మృత్యుముఖం నుండి కాపాడాయని భావోద్వేగంతో చెబుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వారి కథనాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

తల్లి మాటే దైవవాక్కు
వడోదరకు చెందిన యమన్ వ్యాస్ అనే వేర్‌హౌస్ ఉద్యోగి, రెండేళ్ల తర్వాత లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రయాణానికి ముందు తల్లి ఆశీర్వాదం తీసుకుంటుండగా, "కొన్ని రోజులు ఉండిపోరా నాయనా" అని ఆమె కన్నీటితో వేడుకుంది. తల్లి మాట కాదనలేక యమన్ ప్రయాణం రద్దు చేసుకున్నాడు. "విమాన ప్రమాద వార్త తెలిశాక, అమ్మ అంతర్ దృష్టి నన్ను ఎలా కాపాడిందో అర్థమైంది" అని వ్యాస్ ఉద్వేగంగా తెలిపాడు.

పత్రాల లోపం.. తప్పిన ప్రమాదం
అహ్మదాబాద్‌కు చెందిన జైమిన్ పటేల్, ప్రియా పటేల్ దంపతులు లండన్ విహారయాత్రకు సిద్ధమయ్యారు. అయితే, చెక్-ఇన్ కౌంటర్ వద్ద అధికారులు వారి పత్రాల్లో లోపాలున్నాయని ప్రయాణానికి అనుమతించలేదు. తీవ్ర నిరాశతో ఇంటికి చేరిన వారికి, స్నేహితుడి ద్వారా విమాన ప్రమాద వార్త తెలిసింది. "నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఎయిర్ ఇండియా సిబ్బందికి మా ధన్యవాదాలు. దేవుడికి మేమెంతో రుణపడి ఉంటాం" అని జైమిన్ అన్నారు.

మనసులో ఆందోళనతో వాయిదా
సీట్ 1ఏలో ప్రయాణించాల్సిన సవ్జీ టింబడియా, లండన్‌లోని కుమారుడిని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, టేకాఫ్‌కు కొన్ని గంటల ముందు, 'ప్రయాణం చేయాలనిపించడం లేదు, సోమవారం వెళ్తాను' అని కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు. "నా మనసులోని అశాంతే నన్ను కాపాడింది. ఇది స్వామినారాయణుడి దయ" అని ఆయన భక్తితో తెలిపారు.

ట్రాఫిక్ జామ్ చేసిన మేలు
భరూచ్‌కు చెందిన భూమి చౌహాన్, లండన్‌లోని భర్త వద్దకు వెళ్తుండగా, అహ్మదాబాద్‌లో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు 10 నిమిషాలు ఆలస్యంగా చేరడంతో, అప్పటికే గేట్లు మూసివేశారు. "సిబ్బందిని ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. నా కుమారుడిని ఇక్కడే వదిలి వెళ్తున్నాను, ఇది తప్పకుండా గణపతి దేవుడి మహిమే" అని ఆమె కన్నీటితో చెప్పారు.

ఇతర కారణాలతో..
వడోదరకు చెందిన గర్భా ఆర్గనైజర్ జయేష్ ఠక్కర్, కోల్‌కతాలో పని పూర్తికాకపోవడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నారు. అలాగే, రవ్జీ పటేల్ అనే వ్యక్తి తన అల్లుడు అర్జున్ పిలిచినా, వ్యక్తిగత పనుల వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దురదృష్టవశాత్తు, అర్జున్ ఆ విమానంలో ప్రయాణించి మరణించగా, రవ్జీ పటేల్ ప్రాణాలతో మిగిలారు.



More Telugu News