ధోలేరా స్మార్ట్ సిటీ పేరుతో భారీ మోసం... రూ.2,676 కోట్లు కొల్లగొట్టిన అన్నదమ్ములు

  • రాజస్థాన్ అన్నదమ్ముల భారీ స్కామ్
  • నెక్సా ఎవర్ గ్రీన్ పేరుతో రూ.2,676 కోట్ల వసూలు
  • ధోలేరా స్మార్ట్ సిటీలో ప్లాట్లంటూ 70,000 మందికి మోసం
  • మోసపు సొమ్ముతో విలాసవంతమైన ఆస్తుల కొనుగోలు
  • నెక్సా ఎవర్ గ్రీన్ కేసులో ఈడీ సోదాలు, దర్యాప్తు ముమ్మరం
రాజస్థాన్‌కు చెందిన సుభాష్ బిజారాణి, రణ్‌వీర్ బిజారాణి అనే అన్నదమ్ములు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 'ధోలేరా స్మార్ట్ సిటీ'లో ప్లాట్లు, అధిక లాభాల ఆశ చూపి, 'నెక్సా ఎవర్ గ్రీన్' అనే కంపెనీ పేరుతో సుమారు 70,000 మంది నుంచి రూ.2,676 కోట్లు కొల్లగొట్టారు. 2014లో రణ్‌వీర్ ధోలేరాలో కొంత భూమి కొనగా, ఆర్మీ నుంచి రిటైరైన సుభాష్ 2021లో సోదరుడితో కలిసి అహ్మదాబాద్‌లో కంపెనీని రిజిస్టర్ చేసి ఈ మోసానికి తెరలేపారు.

నమ్మించి మోసం చేసిన వైనం

తమ కంపెనీ ప్రతిష్ఠాత్మక 'ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్టులో భాగమని, తమకున్న 1,300 బీగాల భూమిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రచారం చేశారు. ఫ్లాట్లు, ప్లాట్లు, పెట్టుబడి పథకాల ద్వారా భారీ లాభాలు, లెవెల్ ఇన్‌కమ్, కమీషన్లు, బహుమతులు (ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు) ఇస్తామని ఊరించారు. ఈ ప్రచారంతో దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆకర్షించారు. సలీం ఖాన్, సమీర్ వంటి వారిని కీలక అధికారులుగా, వేలాది మంది ఏజెంట్లను నియమించుకుని, వారికి దాదాపు రూ.1,500 కోట్లను కమీషన్ల రూపంలోనే పంచిపెట్టారు.

నిధుల మళ్లింపు, ఈడీ దర్యాప్తు

వసూలు చేసిన సొమ్ముతో మొదట 1,300 బీగాల భూమి కొని, ఆ తర్వాత రాజస్థాన్‌లో విలాసవంతమైన కార్లు, గనులు, హోటళ్లు, అహ్మదాబాద్‌లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్టులు కొన్నారు. సుమారు రూ.250 కోట్లు నగదుగా ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని 27 నకిలీ కంపెనీలకు మళ్లించారు. మోసం బయటపడటంతో నిందితులు పరారయ్యారు. జోధ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. జూన్ 12న రాజస్థాన్, గుజరాత్‌లలోని 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించి, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది.

అసలు ధోలేరా ప్రాజెక్టు ఇదే

నిందితులు వాడుకున్న 'ధోలేరా స్మార్ట్ సిటీ' వాస్తవానికి కేంద్ర, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ఇది దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ. 920 చ.కి.మీ. విస్తీర్ణంలో, ఢిల్లీ కంటే రెట్టింపు పరిమాణంలో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీలతో 2042 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాజెక్ట్ పేరునే నిందితులు తమ మోసానికి అస్త్రంగా వాడుకున్నారు.


More Telugu News