ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కండక్టర్‌ లేకుండానే బయల్దేరిన బస్సు.. చివ‌రికి!

  • గోదావరిఖని డిపో పరిధిలో ఘ‌ట‌న‌
  • గోదావరిఖని బస్టాండ్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లాల్సిన‌ ఎక్స్‌ప్రెస్ బస్సు
  • డ్రైవ‌ర్‌ హడావుడిగా వచ్చి బస్సును స్టార్ట్‌ చేసి వెళ్లిపోయిన వైనం
  • టికెట్లు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో ప్రయాణికుల‌కు అనుమానం
  • బ‌స్సులో కండక్టర్ లేక‌పోవ‌డంతో తిరిగి బస్సును బస్టాండ్‌కు తీసుకొచ్చిన డ్రైవ‌ర్‌
విధి నిర్వహణలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వహించిన ఘ‌ట‌న గోదావరిఖని డిపో పరిధిలో చోటుచేసుకుంది. బస్సులో తనతో పాటు రావాల్సిన కండక్టర్‌ వచ్చాడో లేడో కూడా పట్టించుకోకుండానే బస్సును స్టార్ట్‌ చేసి డ్రైవ‌ర్ సింగిల్‌గానే వెళ్లిపోయాడు. అయితే, కొద్దిదూరం వెళ్లాక కండక్టర్ లేడ‌నే విషయాన్ని ప్రయాణికులు గుర్తించి చెప్పడంతో డ్రైవ‌ర్‌ తిరిగి బస్సును బస్టాండ్‌కు తీసుకొచ్చాడు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే...  గోదావరిఖని బస్టాండ్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ టీఎస్‌027 0286 బస్సు సోమవారం ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే, అప్ప‌టికే ఆల‌స్య‌మైన డ్రైవ‌ర్‌ హడావుడిగా వచ్చి బస్సును స్టార్ట్‌ చేసి వెళ్లిపోయాడు. కానీ, కొంత‌దూరం వెళ్లిన తర్వాత టికెట్లు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో పలువురు ప్రయాణికుల‌కు అనుమానం వ‌చ్చింది. 

దాంతో ప్ర‌యాణికులు బస్సు డ్రైవర్ వ‌ద్ద‌కు వెళ్లి, మీరే టికెట్‌ ఇస్తారా? అని అడిగారు. దానికి అత‌డు లేదు.. కండక్టరే టికెట్లు ఇస్తాడని చెప్పాడు. అంతే.. షాకైన ప్ర‌యాణికులు బస్సులో కండక్టర్ లేని విష‌యం డ్రైవ‌ర్‌తో చెప్పారు. అది విన్న‌ బస్సు డ్రైవర్ నిర్ఘాంత‌పోయాడు. వెంటనే బస్సును తిరిగి బస్టాండ్‌కు తీసుకొచ్చాడు. 

ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడ్డారు. బ‌స్సులో కండక్టర్‌ ఎక్కాడో లేదో కూడా చూడకుండా విధిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని బ‌స్సు డ్రైవ‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ద‌రు డ్రైవర్‌పై గోదావరిఖని బస్‌ డిపో మేనేజర్‌కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.


More Telugu News