హ్యాకింగ్ ద్వారా ఐపీఎల్ ఫ్లడ్ లైట్లను ఆపేశాం.. నీటిని విడుదల చేశాం: పాక్ మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల సెటైర్లు

  • భారత్‌పై పాక్ సైబర్ దాడులు చేసిందన్న రక్షణ మంత్రి
  • ఐపీఎల్ మ్యాచ్‌ల ఫ్లడ్‌లైట్లు హ్యాకింగ్‌తో ఆపేశామన్న ఖవాజా ఆసిఫ్
  • డ్యామ్ గేట్లు కూడా హ్యాక్ చేసి నీరు వదిలామని వ్యాఖ్య
  • పాక్ అసెంబ్లీలో మంత్రి చేసిన వింత ప్రకటన వైరల్
  • మంత్రి మాటలపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్, సెటైర్లు
పాకిస్థాన్ నాయకులు తరచూ అవాస్తవాలు పలుకుతూ అడ్డంగా దొరికిపోవడం కొత్తేమీ కాదు. ప్రత్యేకించి భారత్ విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారికి పరిపాటిగా మారింది. తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. పాకిస్థాన్ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.

అసెంబ్లీలో మంత్రి ఏమన్నారంటే..

"పాకిస్థాన్ సాంకేతిక సామర్థ్యం గురించి భారత్‌కు పూర్తిగా అవగాహన లేదు. మన దేశానికి చెందిన సైబర్ యోధులు భారత్‌పై అనేక దాడులు నిర్వహించారు. అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో హ్యాకింగ్ ద్వారా ఫ్లడ్‌లైట్లను ఆపివేశారు. తద్వారా మ్యాచ్ జరగకుండా అడ్డుకున్నారు" అని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, "భారత్‌లోని డ్యామ్‌ గేట్లను కూడా హ్యాక్ చేసి నీటిని విడుదల చేశాం. ఇదంతా పాకిస్థాన్ పనేనని వారు ఏమాత్రం ఊహించి ఉండరు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఆయన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, ట్రోలింగ్ చేస్తున్నారు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ఒక నెటిజన్ స్పందిస్తూ, "మే 8న ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ కాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. బహుశా మంత్రిగారు ఆ సంఘటనను ఉద్దేశించి మాట్లాడి ఉంటారేమో" అని వ్యాఖ్యానించారు. మరొకరు, "ఫ్లడ్‌లైట్లను ఎలా హ్యాక్ చేయగలరో రక్షణ మంత్రి వివరంగా చెప్పలేదు" అంటూ ఎద్దేవా చేశారు. "విద్యుత్ వ్యవస్థతో వెలిగే లైట్లను ఎలా హ్యాక్‌ చేయొచ్చనేది పాకిస్థాన్ సిలబస్‌లో ఏమైనా ఉందా?" అని ఇంకొకరు ప్రశ్నించారు.

"ఆయన బహుశా సైన్స్‌ గురించి సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడారేమో" అని ఒకరు అభిప్రాయపడగా, "ఈసారి దయచేసి స్కోరింగ్ బోర్డును హ్యాక్‌ చేయండి" అంటూ మరో నెటిజన్ చమత్కరించారు. "మీ కామెడీ టైమింగ్‌ అద్భుతం సార్‌.. ఫ్లడ్‌లైట్లను హ్యాక్ చేశారా? అది ఎలాగో మాకు కాస్త వివరించండి", "భారత్‌పై సైబర్ దాడి చేశారా? అరెరే మాకు తెలియలేదే", "మరోసారి పాకిస్థాన్ టీమ్‌ ఆడే సమయంలో వారిని కూడా హ్యాక్‌ చేసి గెలిపించండి" అంటూ నెటిజన్లు ఫన్నీ పోస్టులతో మంత్రి వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.


More Telugu News