ఉపరాష్ట్రపతితో నారా లోకేశ్ భేటీ

  • రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన లోకేశ్
  • జగదీప్ ధన్కర్ తో పలు అంశాలపై చర్చించిన లోకేశ్
  • లోకేశ్ వెంట రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. 

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకబు చేయగా, రూ. 64 వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తిచేస్తామని లోకేశ్ చెప్పారు. ఈనెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమం చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేశ్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకొని పోరాడానని ధన్కర్ అన్నారు. 

ఈ సందర్భంగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకుకడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేశ్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్, శబరి పాల్గొన్నారు. 


More Telugu News