నా కూతురే పరకాల అభ్యర్థి.. పైసలిచ్చి గెలిపిస్తా.. రాహుల్ బర్త్‌డే వేడుకలో కొండా మురళి వివాదాస్పద కామెంట్స్

  • సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతపై కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు
  • కొందరు నాయకులు టీడీపీ, బీఆర్ఎస్‌లను నాశనం చేశారని ఆరోపణలు
  • వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కుమార్తె సుష్మిత పోటీ అని ప్రకటన
  • మంత్రి సురేఖ శాఖకు తానే నిధులు ఖర్చులు భరిస్తున్నానని వెల్లడి
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఒక ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలు వరంగల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గురువారం వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా మురళి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొందరు నాయకుల తీరుపై మురళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "వరంగల్‌లో కొంతమంది నాయకులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, ఆ తర్వాత ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్‌ల దగ్గరకు చేరి వారిని కూడా తప్పుదోవ పట్టించి, వాళ్లనూ నాశనం చేశారు" అని ఆరోపించారు. వారిలో ఒకరు గతంలో ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’ అని కూడా మురళి గుర్తుచేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె సుష్మితా పటేల్ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొండా మురళి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. "పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమార్తె సుష్మితా పటేల్‌ పరకాల నుంచి బరిలో ఉంటుంది" అని ఆయన ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ వర్గం సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. "వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను, కార్పొరేటర్లను మనమే గెలిపించుకోవాలి. అందుకు పైసలివ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ఇదే నా పని" అంటూ ఎన్నికల వ్యూహాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

మంత్రి కొండా సురేఖ పదవి విషయంలో ఎలాంటి ఢోకా లేదని, అయితే ఆమె నిర్వహిస్తున్న శాఖలకు నిధుల కేటాయింపు సరిగా జరగడం లేదని మురళి అన్నారు. "రేవంత్‌రెడ్డి, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉండగా కొండా సురేఖ మంత్రి పదవి ఎటూ పోదు. కానీ, ఆమె శాఖలకు పైసలు రావడం లేదు. నేనే ప్రతినెలా ఖర్చులకు రూ.5 లక్షలు పంపిస్తున్నా" అని ఆయన చెప్పడం గమనార్హం. కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.


More Telugu News