స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ ఉద్రిక్తతల దెబ్బ.. భారీ నష్టాలు

  • మార్కెట్లపై ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధ ప్రభావం
  • 511 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 140 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరో భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం భయాలు అమ్మకాల ఒత్తిడికి దారితీశాయి. ఫలితంగా, సెన్సెక్స్ ఏకంగా 511 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 140 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం, ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు జరిగాయన్న వార్తలు ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపైనా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీనికి తోడు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందేమోనన్న ఆందోళనలు పెట్టుబడిదారులను అమ్మకాల వైపు నడిపించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో, బీఎస్ఈ సెన్సెక్స్ చివరికి 511 పాయింట్ల నష్టంతో 81,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 24,971 వద్ద ముగిసింది. 

నేటి ట్రేడింగ్‌లో ప్రధానంగా ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ కూడా నిఫ్టీ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు కొంతమేర తట్టుకుని నిలబడటం గమనార్హం. మరోవైపు ట్రెంట్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలను ఆర్జించాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.76 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.35 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 3,381 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 


More Telugu News