ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు ఖతర్ మధ్యవర్తిత్వం!

  • ఇరాన్‌ను ఒప్పించేందుకు సాయం చేయాలని ఖతర్ ఎమిర్‌ను కోరిన ట్రంప్
  • ట్రంప్ చొరవతో రంగంలోకి ఖతర్
  • కాల్పుల విరమణకు టెహ్రాన్ అంగీకరించిందని ప్రకటన
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి టెహ్రాన్ అంగీకరించిందని ఖతర్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌ రహమాన్ అల్ థానీ వెల్లడించినట్టు చర్చల్లో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. అయితే, ఈ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది.

నిన్న ఖతర్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన అనంతరం మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఖతర్ ఎమిర్‌ను కోరినట్టు సమాచారం. ఇజ్రాయెల్ ఇప్పటికే కాల్పుల విరమణకు అంగీకరించిందని, ఇరాన్‌ను కూడా ఒప్పించేందుకు ఖతర్ సహాయం చేయాలని ట్రంప్ ఎమిర్‌కు చెప్పినట్టు సదరు అధికారి వెల్లడించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఖతర్ ప్రధానమంత్రి ఇరాన్ అధికారులతో చర్చలు జరిపి, కాల్పుల విరమణ నిబంధనలకు టెహ్రాన్ కట్టుబడి ఉండేలా విజయవంతంగా ఒప్పించారని తెలిసింది. ఖతర్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణను టెహ్రాన్ ఆమోదించినట్టు ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అమెరికా అధ్యక్షుడి వాదనలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది.

అంతకుముందు, డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం ముగిసినట్టు ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు ట్రంప్ ఖతార్ ఎమిర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న అమెరికా అధ్యక్షుడి వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఖండించారు. అటువంటి ఒప్పందం ఏదీ కుదరలేదని స్పష్టం చేశారు.


More Telugu News