వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 700 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 200 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.07
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడం, అదే సమయంలో ముడి చమురు ధరలు కూడా కిందకు రావడం మన మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఈ సానుకూల పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 82,755 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 25,244 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల బాట పట్టగా, ముఖ్యంగా ఐటీ, మీడియా రంగాల షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. వీటితో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా సుమారు ఒకటిన్నర శాతం మేర పెరిగాయి.

సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. టైటాన్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 67.60 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3340 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.07గా ఉంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, చమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News