లోకేశ్‌ను కలిసిన జాహ్నవి.. అంతరిక్ష యాత్రకు ఎంపికైన పాలకొల్లు యువతి

  • అంతరిక్ష యాత్రకు ఎంపికైన పాలకొల్లు అమ్మాయి జాహ్నవి
  • మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన యువ వ్యోమగామి
  • జాహ్నవిని అభినందించిన మంత్రి, ప్రభుత్వ సాయం ప్రకటన
  • 2029లో టైటాన్ స్పేస్ మిషన్ ద్వారా నింగిలోకి జాహ్నవి
  • విద్యాశాఖ స్టెమ్ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానం
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక టైటాన్ స్పేస్ మిషన్‌కు ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో జాహ్నవి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా ఆమె వెంట ఉన్నారు.

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించనున్న జాహ్నవిని మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు బిడ్డగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. జాహ్నవి అంతరిక్ష యాత్రకు ఎంపికైన క్రమం, ఆమె పడ్డ శ్రమ గురించి మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆమె సాధించిన విజయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ జాహ్నవి భవిష్యత్ ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, రాష్ట్ర విద్యాశాఖ చేపట్టే "స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) అవుట్ రీచ్ యాక్టివిటీ"లో ప్రభుత్వం తరపున భాగస్వామి కావాలని జాహ్నవిని కోరారు. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినివ్వవచ్చని ఆయన సూచించారు. కాగా, దంగేటి జాహ్నవి 2029లో తన తొలి అంతరిక్ష యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్ర ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తి పతాకాన్ని ఆమె ఎగురవేయనున్నారు.


More Telugu News