ఏపీ మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ .. చంద్రబాబుపై ప్రశంసల జల్లు

  • అమరావతిలో మంత్రి నారాయణతో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేతృత్వంలోని బృందం భేటీ 
  • రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్
  • మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అంటూ కితాబు
రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలిపారు. నిన్న రాజధాని అమరావతిలో మంత్రి నారాయణతో గారెత్ విన్ ఓవెన్‌తో కూడిన ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది.

ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. అమరావతిలోని స్థానిక ఐకానిక్ భవనాల డిజైన్లను యూకేకు చెందిన నార్మన్ ఫాస్టర్ రూపొందించారని ఆ బృందానికి వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని గారెత్ విన్ ఓవెన్ సారథ్యంలోని ప్రతినిధి బృందం ప్రశంసించింది. ప్రధానంగా రాజధాని నిర్మాణాల్లో డిజైన్, ఇంజనీరింగ్ సేవల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని యూకే ఇన్‌ఫ్రాస్టక్చర్ ఎక్స్‌పోర్ట్ చైర్ పర్సన్ పర్వీస్ వెల్లడించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


More Telugu News