కాగ్నిజెంట్ కు వెల్కమ్ చెప్పిన సీఎం చంద్రబాబు

  • విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం
  • కాపులుప్పాడలో అత్యాధునిక క్యాంపస్ నిర్మాణం
  • రాష్ట్ర యువత ప్రతిభావంతులని, సాంకేతికంగా ముందున్నారని చంద్రబాబు వ్యాఖ్య
  • స్వర్ణాంధ్ర అభివృద్ధికి కాగ్నిజెంట్ దోహదపడుతుందని ఆశాభావం
అంతర్జాతీయ టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్ లో తన కార్యకలాపాలను మరింత విస్తరించే క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడుతోంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాగ్నిజెంట్ సంస్థకు సాదర స్వాగతం పలికారు. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ యువత అపారమైన ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలతో ప్రపంచాన్ని శాసించడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కాగ్నిజెంట్ రాకతో ఇటు సంస్థకు, అటు రాష్ట్రానికి పరస్పర వృద్ధికి అవకాశం లభిస్తుందని తెలిపారు. 

విశాఖపట్నంలోని కాపులుప్పాడలో నిర్మించనున్న ఈ అత్యాధునిక క్యాంపస్... టెక్ ఆవిష్కరణలు, ప్రతిభ, ప్రపంచస్థాయి భాగస్వామ్యాల ద్వారా స్వర్ణాంధ్ర నిర్మాణానికి గణనీయంగా దోహదపడుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత నైపుణ్యాలకు కాగ్నిజెంట్ ఒక మంచి వేదిక అవుతుందని, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.

కాగ్నిజెంట్ సంస్థను విశాఖపట్నానికి స్వాగతిస్తూ, వారికి అన్ని విధాలా శుభం కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ పెట్టుబడి రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలకమైన టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో సహాయపడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగ్నిజెంట్ రాకతో విశాఖ నగరం ఐటీ రంగంలో మరింత కీలక ప్రాంతంగా మారుతుందని భావిస్తున్నారు.


More Telugu News