ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య

  • హైదరాబాద్‌లోని నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని మృతి
  • స్నేహితుడితో మనస్పర్థలే కారణమని పోలీసుల అనుమానం
  • తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు
  • మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు
  • ఇటీవలే జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఈసీ మెంబర్‌గా ఎన్నిక
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడటం జర్నలిస్టు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఫ్యానుకు లుంగీతో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వేచ్ఛ, తన కుమార్తె, ఒక స్నేహితుడితో కలిసి ఉంటున్నారు. అయితే, ఆ స్నేహితుడితో ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆమె మృతికి కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి శంకర్, ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో చేస్తున్నారు. 

ఇటీవలే జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యురాలిగా ఎన్నికయ్యారు. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వేచ్ఛ ఆకస్మిక మరణం పట్ల తోటి జర్నలిస్టులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News