సోషల్ మీడియాలో మరోసారి రష్మిక, విజయ్ రచ్చ.. ఆ ఒక్క పిలుపుతో!

  • రష్మిక మందన్న కొత్త చిత్రం 'మైసా' ఫస్ట్ లుక్ విడుదల
  • సినిమా పోస్టర్‌పై విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం
  • విజయ్‌కు 'విజ్జూ' అంటూ రష్మిక ఆసక్తికరమైన రిప్లై
  • నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా అంటూ పోస్ట్
  • మరోసారి తెరపైకి వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు
నేష‌న‌ల్ క్ర‌ష్‌ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. రష్మిక కొత్త సినిమా 'మైసా'కు విజయ్ అభినందనలు తెలపగా, దానికి ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట‌ వైరల్‌గా మారింది. విజయ్‌ను 'విజ్జూ' అని ప్రేమగా పిలుస్తూ ఆమె చేసిన పోస్ట్, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, ఇటీవల 'మైసా' అనే తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఇంతకుముందు ఎప్పుడూ పోషించని పాత్ర.. నేనెప్పుడూ అడుగుపెట్టని ఓ ప్రపంచం" అంటూ ఈ సినిమాపై అంచనాలను పెంచారు. ఈ పోస్టర్‌పై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే నటుడు విజయ్ దేవరకొండ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'మైసా' పోస్టర్‌ను షేర్ చేశారు. "ఇది అద్భుతంగా ఉండనుంది" అని క్యాప్షన్ జోడించి చిత్రబృందాన్ని అభినందించారు. విజయ్ పోస్ట్‌కు రష్మిక వెంటనే స్పందించారు. ఆయన స్టోరీని రీషేర్ చేస్తూ "విజ్జూ.. ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా" అని బదులిచ్చారు. ఈ క్యాప్షన్‌కు ఒక హార్ట్‌ ఎమోజీని కూడా జతచేశారు.

మరోసారి రిలేషన్‌షిప్‌పై చర్చ
గత కొంతకాలంగా విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తరచూ కలిసి కనిపించడం, ఒకరి సినిమాలకు మరొకరు మద్దతు తెలుపుకోవడంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇటీవల కూడా వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు రష్మిక బహిరంగంగా విజయ్‌ను 'విజ్జూ' అని పిలవడంతో వారి మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇక, సినిమాల విషయానికొస్తే ర‌ష్మిక‌.. రవీంద్ర పుల్లె అనే నూతన దర్శకుడు 'మైసా' చిత్రం చేస్తున్నారు. అలాగే రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ష‌న్‌లో 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్' అనే మ‌రో మూవీ చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'కింగ్‌డమ్‌' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.


More Telugu News