విద్యావ్యవస్థ అస్తవ్యస్తం... ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్

  • ఈసెట్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్
  • ఫలితాలొచ్చి 45 రోజులైనా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని విమర్శ
  • "అమాత్యా మేలుకో, పప్పూ నిద్ర వదులు" అంటూ ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యమే నిదర్శనమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫలితాలు వెలువడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంతవరకు కౌన్సెలింగ్ ప్రారంభించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ఠ అని విమర్శించారు.

ఈసెట్ ఫలితాలు గత నెల మే 15వ తేదీన వెలువడినా, నేటికీ అడ్మిషన్ల ప్రక్రియపై ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా అస్తవ్యస్తంగా మారిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆయన అన్నారు. రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానుండగా, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన "అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షకు హాజరుకాగా, వారిలో 31,922 మంది అర్హత సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జగన్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.


More Telugu News