బిగ్ బ్రేకింగ్... బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

  • బీజేపీ సభ్యత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా
  • రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన నిర్ణయం
  • తన అనుచరులను బెదిరించారని తీవ్ర ఆరోపణ
తెలంగాణ బీజీపీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, ఇకపై బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజాసింగ్ ఈ మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన అనుచరులను కొందరు నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేదు. అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు. అధ్యక్షుడిని ముందే నిర్ణయించుకుని, ఎన్నికల పేరుతో నాటకాలు ఆడుతున్నారు" అని ఆయన ఆరోపించారు. 2019 నుంచి పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డానని, పార్టీ కోసమే తాను ఉగ్రవాదులకు టార్గెట్ గా మారానని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతల వైఖరిపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయన నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. తాజా పరిణామంతో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడినట్లయింది. 


More Telugu News