పటాన్‌చెరు మార్చురీ వద్ద 11 మృతదేహాల అప్పగింత

  • పాశమైలారం ఘటనలో పలువురు మృతి
  • పటాన్‌చెరు ఆస్పత్రి వద్ద బంధువుల ఆర్తనాదాలు
  • పోస్టుమార్టం పూర్తి చేసి 11 మంది మృతదేహాలను బంధువులకు అందజేత
పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో పాశమైలారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో విషాదం కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఈరోజు హృదయాలను ద్రవింపజేసే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రంగా మారింది. ఏ మృతదేహం ఎవరిదో తెలియని అయోమయ స్థితిలో బంధువులు మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ప్రమాద తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో, వాటిని గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించే ప్రక్రియను వైద్య శాఖ అధికారులు చేపట్టారు. డీఎన్ఏ నివేదికలు అందిన తర్వాతనే, నిర్ధారించుకుని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో కుటుంబ సభ్యుల ఆవేదన మరింత పెరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఇప్పటివరకు గుర్తించిన 11 మంది మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం ఈ 11 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు, తెలంగాణకు చెందిన వారు ఒకరు, ఒడిశా నుంచి ముగ్గురు, బీహార్ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పోస్టుమార్టం పూర్తయి, కుటుంబాలకు అప్పగించిన వారి వివరాలు

1. రాజనాల జగన్మోహన్ (ఒడిశా)
2. రామ్ సింగ్ రాజ్ బార్ (యూపీ)
3. శశి భూషణ్ కుమార్ (బీహార్)
4. లగ్నజిత్ దావూరి (ఒడిశా)
5. హేమ సుందర్ (చిత్తూరు)
6. రక్సూనా ఖాతూన్ (బీహార్)
7. నిఖిల్ రెడ్డి (కడప)
8. నాగేశ్వరరావు (మంచిర్యాల)
9. పోలిశెట్టి ప్రసన్న (తూర్పు గోదావరి)
10. శ్రీ రమ్య (కృష్ణా జిల్లా)
11. మనోజ్ (ఒడిశా).


More Telugu News