మేడారం జాతర తేదీలు ఖరారు.. జనవరి 28 నుంచి మహా వేడుక!

  • మేడారం మహాజాతర తేదీలను ప్రకటించిన పూజారులు
  • వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ
  • ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి
  • జనవరి 28న గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు
  • 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం
  • 31న వనప్రవేశంతో జాతరకు ముగింపు
కోట్లాది మంది భక్తులు ఆరాధించే వనదేవతలు సమ్మక్క, సారలమ్మల జాతరకు ముహూర్తం ఖరారైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర-2026 తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ మహా వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపింది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ జాతర జరగనుంది. పూజారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 28వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 29న, జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు.

జనవరి 30వ తేదీన భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి పూర్తి రోజు కేటాయించారు. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. ఇక చివరి రోజైన జనవరి 31న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ మహాజాతర ముగుస్తుందని పూజారుల సంఘం తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ తేదీల ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని భక్తులు జాతర ఏర్పాట్లకు సిద్ధమయ్యేందుకు మార్గం సుగమమైంది.


More Telugu News