హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందని విజయశాంతి ఫైర్

  • కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే జాప్యం చేస్తున్నారని ఆరోపణ
  • 'ఎక్స్' వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించిన విజయశాంతి
  • సీఎం రేవంత్ వినతులను పట్టించుకోవడం లేదని ఆవేదన
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచన
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని విజయశాంతి గుర్తుచేశారు. ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి మెట్రో రెండో దశ విస్తరణ ఆవశ్యకతను వివరిస్తున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు సమర్పించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆమె అన్నారు.

ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ నాయకులు తమ బాధ్యతను గుర్తించాలని విజయశాంతి హితవు పలికారు. జీహెచ్ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీగా 42 మంది కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నారని, వారు మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. తమను నమ్మి ఓటు వేసిన నగర ప్రజలకు న్యాయం చేయాలంటే బీజేపీ నేతలు ఈ ప్రాజెక్టు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక బాధ్యత వహించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. వారంతా కలిసికట్టుగా కేంద్ర మంత్రులను ఒప్పించి, మెట్రో రెండో దశకు తక్షణమే ఆమోదం లభించేలా చూడాలన్నారు. ఈ కీలకమైన ప్రాజెక్టు విషయంలో బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఇదేనని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News