గ్రూప్-1 వివాదం.. కోర్టులో వాదనలు వినిపించిన టీజీపీఎస్సీ

  • గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
  • టీజీపీఎస్సీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి
  • కోఠి సెంటర్ నుంచి ఎక్కువమంది ఎంపికయ్యారన్న ఆరోపణల ఖండన
  • అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేదని స్పష్టీకరణ
  • ఉద్యోగం రానివారే అనుమానాలతో పిటిషన్లు వేశారని కోర్టుకు వెల్లడి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్-1 ఎంపికల విషయంలో వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు.

ముఖ్యంగా, కోఠిలోని ఒకే పరీక్షా కేంద్రం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోఠిలో ఉన్న రెండు కేంద్రాలను కేవలం మహిళా అభ్యర్థుల సౌకర్యం కోసమే కేటాయించామని తెలిపారు. ఆ కేంద్రాల నుంచి దాదాపు 1,500 మంది మెయిన్స్ పరీక్ష రాయగా, ఇతర కేంద్రాల నుంచి అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు ఎంపికయ్యారని వివరించారు.

పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలోనూ ఎటువంటి తేడాలు లేవని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపిక కాని కొందరు అభ్యర్థులు నిరాధారమైన అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారని, వారి ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని వాదించారు.


More Telugu News