"మహారాష్ట్రలో అన్ని భాషలూ మాట్లాడతారు" అన్నందుకు చితకబాదారు!... మంత్రి అనూహ్య స్పందన!

  • మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడలేదని ఓ దుకాణదారుడిపై దాడి
  • హిందీలో మాట్లాడిన సిబ్బందిపై ఎంఎన్ఎస్ కార్యకర్తల ఆగ్రహం
  • ‘ఇక్కడ అన్ని భాషలూ మాట్లాడతారు’ అన్న యజమానిపై దాడి
  • ఘటనను ఖండించిన మంత్రి.. కానీ మరాఠీ మాట్లాడాల్సిందేనని వ్యాఖ్య
మహారాష్ట్రలో భాష మరోసారి వివాదానికి దారితీసింది. మరాఠీలో మాట్లాడలేదన్న కారణంతో ఓ దుకాణ యజమానిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన థానే ప్రాంతంలోని మీరా రోడ్డులో చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం పెద్ద దుమారం రేపింది.

వివరాల్లోకి వెళితే, మీరా రోడ్డులో స్వీట్ షాప్ నడుపుతున్న బాబులాల్ ఖిమ్జీ చౌదరి (48) దుకాణంలోకి మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ప్రవేశించారు. ఎంఎన్ఎస్ పార్టీ చిహ్నాలతో ఉన్న దుస్తులు ధరించిన వారు నీళ్లు అడగగా, దుకాణ సిబ్బంది ఒకరు హిందీలో సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు మరాఠీలో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

ఈ క్రమంలో యజమాని బాబులాల్ కలుగజేసుకుని, తన సిబ్బంది ఇతర రాష్ట్రాల వారని, వారికి మరాఠీలో స్పష్టంగా మాట్లాడటం రాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. "మహారాష్ట్రలో ఏ భాష మాట్లాడతారు?" అని వారు ప్రశ్నించగా, "ఇక్కడ అన్ని భాషలూ మాట్లాడతారు" అని బాబులాల్ సమాధానమిచ్చారు. ఈ జవాబుతో మరింత రెచ్చిపోయిన దుండగులు, ఆయనపై దాడి చేసి ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కాశిమీరా పోలీస్ స్టేషన్‌లో ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే, ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ అనూహ్యరీతిలో స్పందించారు. "మహారాష్ట్రలో ఉంటే మరాఠీ మాట్లాడాల్సిందే. మరాఠీ రాకపోయినా, మాట్లాడననే ధోరణి ప్రదర్శించకూడదు. మరాఠీని ఎవరైనా అగౌరవిస్తే మా చట్టాలను ప్రయోగిస్తాం" అని అన్నారు. అయితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని, దాడికి పాల్పడిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ కార్యకర్తలు ఓ ప్రభుత్వ నిర్ణయంపై సంబరాలు చేసుకుంటూ నీళ్ల కోసం దుకాణానికి వెళ్లారని, యజమాని అహంకారపూరితంగా మాట్లాడటం వల్లే గొడవ జరిగిందని ఓ ఎంఎన్ఎస్ నేత వాదించారు.


More Telugu News