భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి... ప్రధాని మోదీ చెప్పగానే ఆశ్చర్యపోయిన ఘనా ఎంపీలు

  • ఆఫ్రికా దేశం ఘనాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
  • దేశ అత్యున్నత పురస్కారంతో ప్రధానికి ఘన సత్కారం
  • ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం
  • ఆఫ్రికా అభివృద్ధికి భారత్ తోడ్పాటునందిస్తుందని హామీ
  • ముప్పై ఏళ్ల తర్వాత ఘనా వెళ్లిన భారత ప్రధానిగా గుర్తింపు
"భారతదేశంలో సుమారు 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయి" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విన్న ఘనా పార్లమెంట్ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి స్పందనను గమనించిన ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించారు. ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటిస్తున్న ఆయన, గురువారం ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్య వైవిధ్యం, దాని స్ఫూర్తి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలను భిన్నమైన పార్టీలు పాలిస్తున్నాయని, 22 అధికారిక భాషలతో పాటు వేల సంఖ్యలో ఇతర భాషలు ఉన్నాయని మోదీ తెలిపారు. ఈ భిన్నత్వమే భారతీయుల విశాల హృదయానికి కారణమని, అందుకే ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు అందరితో సులభంగా కలిసిపోతారని వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఘనా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఆ దేశ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మోదీ పునరుద్ఘాటించారు. ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో భారత్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జీ20 కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.


More Telugu News