ప్రజాగ్రహానికి తలొగ్గిన ఢిల్లీ సర్కారు... పాత వాహనాల యజమానులకు ఊరట!

  • పాత వాహనాలకు ఇంధపం నిరాకరణ ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ ప్రభుత్వం
  • ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కీలక నిర్ణయం
  • సాంకేతిక సవాళ్ల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్న పర్యావరణ మంత్రి
  • 15 ఏళ్ల పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాలపై నిషేధం విధించిన వైనం
  • ప్రభుత్వ నిర్ణయంతో 62 లక్షల వాహన యజమానులకు భారీ ఊరట
కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిరాకరించాలన్న వివాదాస్పద ఉత్తర్వుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (హోల్డ్‌లో పెడుతున్నట్లు) ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఈ విషయంపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా గురువారం మీడియాతో మాట్లాడారు. ఫ్యూయల్ బ్యాన్‌ను అమలు చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయని ఆయన అంగీకరించారు. పాత వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాల వ్యవస్థ పటిష్టంగా లేదని తెలిపారు. "ఈ కెమెరాలకు సాంకేతిక లోపాలున్నాయి. కొత్తగా వచ్చిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అవి సరిగ్గా గుర్తించలేకపోతున్నాయి. అందుకే ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ను కోరాం" అని ఆయన వివరించారు.

నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను 'ఎండ్ ఆఫ్ లైఫ్' (కాలం చెల్లినవి)గా పరిగణించి, వాటికి ఇంధనం ఇవ్వకుండా స్క్రాప్‌కు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలో సుమారు 62 లక్షల వాహనాలపై ప్రభావం పడింది. అయితే, పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీసీ) ఉండి, మంచి కండిషన్‌లో ఉన్న తమ వాహనాలను కూడా బలవంతంగా తుక్కుకు పంపాలా? అంటూ అనేక మంది యజమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"16 ఏళ్ల నాటి మా మెర్సిడెస్ బెంజ్ కారు ఇప్పటికీ ఎంతో క్లీన్‌గా, కొత్త కార్ల కంటే మెరుగ్గా నడుస్తోంది. కానీ ఈ నిబంధన వల్ల అది తుక్కుగా మారిపోయింది" అంటూ ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి తన ఎనిమిదేళ్ల రేంజ్ రోవర్ కారును ఈ పాలసీ కారణంగా అమ్మేయాల్సి వచ్చిందని వాపోయారు. ఇది పర్యావరణ పరిరక్షణ విధానం కాదని, ప్రజలను కొత్త కార్లు కొనేలా బలవంతం చేసే చర్య అని పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, తాత్కాలికంగా నిలిపివేసింది.


More Telugu News