యశోద ఆసుపత్రిలో కేసీఆర్.. ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన

  • అస్వస్థతతో యశోద ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్
  • ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించిన వైద్యులు
  • అధిక షుగర్, తక్కువ సోడియం స్థాయిలు ఉన్నట్టు నిర్ధారణ
  • కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణ
  • ఆందోళన చెందవద్దని 'ఎక్స్‌' వేదికగా తెలిపిన కేటీఆర్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఆసుపత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆసుపత్రి వర్గాలు, ఆయన కుమారుడు కేటీఆర్ వేర్వేరుగా స్పష్టం చేశారు.

గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్‌ను గురువారం సాయంత్రం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో చక్కెర (షుగర్) స్థాయిలు అధికంగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తేలిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

ఈ మేరకు గురువారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. చక్కెర, సోడియం స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతారని డాక్టర్ ఎంవీ రావు బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఈ విషయంపై కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్‌’ (ట్విట్ట‌ర్‌) వేదికగా స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే తన తండ్రి ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్య సూచికలన్నీ (వైటల్స్) సాధారణంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.


More Telugu News