నైపుణ్యం పోర్టల్... ఉద్యోగాల కల్పనకు మిషన్ మోడ్ తో తీసుకెళతాం: మంత్రి నారా లోకేశ్

  • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
  • సెప్టెంబర్ 1 నాటికి 'నైపుణ్యం' పోర్టల్ ప్రారంభించాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాల నిర్వహణ
  • ఐటీఐల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్ల నిధులు కేటాయింపు
  • విదేశీ ఉద్యోగాల కోసం దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలని సూచన
  • పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ తయారయ్యేలా ఏర్పాట్లు
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా.. యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సింగిల్ ప్లాట్ ఫామ్ 'నైపుణ్యం పోర్టల్'ను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ ను ప్రజల్లోకి తీసుకెళతామని వెల్లడించారు. 

ఇందులో 90 రోజులపాటు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు సెప్టెంబర్ 1 నాటికి నైపుణ్యం పోర్టల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా నైపుణ్యం పోర్టల్ ను తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. నైపుణ్యం పోర్టల్ లో ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా రెజ్యుమ్ సిద్ధమయ్యేలా పోర్టల్ ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే స్కిల్ అసెస్ మెంట్, అన్ని కంపెనీల్లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల అవకాశాలను యువతకు తెలియజేసి తగిన నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర సమాచార సేకరణకు వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని క్లస్టర్ల వారీగా విభజించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే అంశంపై అధికారులు మంత్రికి వివరించారు.

మంత్రి లోకేశ్ కృషితో ఐటీఐల అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించిన కేంద్రం

ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా రూ.600 కోట్లు కేటాయించడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఓమ్ క్యాప్ విభాగంపైనా సమావేశంలో చర్చించారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనను మరింత సులభతరం చేసేలా ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సూచించారు. 

ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేశ్ కుమార్, కాలేజి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్ సీత శర్మ, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రఘు తదితరులు పాల్గొన్నారు.


More Telugu News