ట్రంప్‌కు మోదీ తలొగ్గుతారు.. గోయల్ గుండెలు బాదుకుంటారు: రాహుల్ గాంధీ

  • అమెరికా సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని రాహుల్ విమర్శ
  • మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం ఖాయమన్న రాహుల్
  • జులై 9 గడువులోగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై తీవ్ర చర్చలు
  • గడువుల కోసం ఒప్పందాల్లో తొందరపడబోమని స్పష్టం చేసిన కేంద్రం
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని, ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు.

మూడు నెలల క్రితం భారత్‌పై అమెరికా 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల సస్పెన్షన్ గడువు జులై 9తో ముగియనుండటంతో ఆలోగా ఓ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ విమర్శలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ పటిష్ఠమైన విధానాలను అనుసరిస్తోందని స్పష్టం చేశారు. గడువులను చూసి కీలక ఒప్పందాలపై తొందరపడబోమని, ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూరితేనే ముందుకెళ్తామని ఆయన తెలిపారు.

ఈ ఒప్పందంలో భాగంగా వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తులపై సుంకాల మినహాయింపును భారత్ కోరుతోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక వస్తువులు, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. 

అయితే, పాడి, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళనల నేపథ్యంలో ఆ డిమాండ్లకు భారత్ అంగీకరించడం లేదు. ఇప్పటికే చర్చల నిమిత్తం అమెరికా వెళ్లిన భారత బృందం తిరిగిరావడంతో జులై 9లోగా ఓ మధ్యంతర ఒప్పందం కుదిరే అవకాశం ఉందని స‌మాచారం.


More Telugu News