ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

  • అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్
  • సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్
  • ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు
  • చక్కెర, సోడియం స్థాయిలు అదుపులోకి వచ్చినట్లు స్పష్టం
  • నందినగర్‌లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన‌ ఆయన, ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

ఈ నెల 3వ తేదీన జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరగడం, సోడియం స్థాయిలు పడిపోవడంతో కేసీఆర్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన యశోద ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు.

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన రక్తంలో చక్కెర, సోడియం స్థాయిలు సాధారణ స్థితికి చేరాయని స్పష్టం చేశారు. జ్వరం కూడా తగ్గడంతో నిన్నటి నుంచే ఆయన ఉత్సాహంగా ఉన్నారని, పార్టీ నేతలతో కూడా మాట్లాడారని తెలిసింది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అనుమతించారు. 


More Telugu News