అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్

  • చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై హైదరాబాద్‌లో సదస్సు
  • మహిళలు, పిల్లల భద్రతకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న సీఎం 
  • నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని, ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరిక
  • భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు పూర్తి అండగా నిలుస్తున్నామని వెల్లడి
చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో శనివారం "లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత" అనే అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో ముఖ్య‌మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులపై జరిగే లైంగిక హింసను సమాజంలో ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. వాటి ద్వారా బాధితులకు పూర్తి భద్రత, సహకారం అందిస్తున్నామని వివరించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు, ముఖ్యంగా యువత సోషల్ మీడియా వాడకం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కీలకమైన సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు.


More Telugu News