సుంకాలపై ట్రంప్ సంతకం.. ఆ 12 దేశాల జాబితాలో భారత్‌ ఉందా?

  • 12 దేశాల దిగుమతులపై సుంకాల విధింపునకు ట్రంప్ ఆమోదం
  • సోమవారం వెల్లడికానున్న దేశాల జాబితా
  • కొన్ని దేశాలపై 70 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం
  • అమెరికాతో ఫలించని భారత అధికారుల చర్చలు
  • వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తుల విషయంలో ప్రతిష్టంభన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. సుమారు 12 దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన లేఖలపై ఆయన సంతకాలు చేశారు. దీంతో ఆ జాబితాలో భారత్ ఉందా లేదా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. "నేను కొన్ని లేఖలపై సంతకాలు చేశాను. అవి సోమవారం వెల్ల‌డవుతాయి. బహుశా 12 దేశాలకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు, వేర్వేరు సుంకాలు ఉంటాయి" అని తెలిపారు. ఆయా దేశాల పేర్లను మాత్రం ఆయన సోమవారమే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రావచ్చని, కొన్ని దేశాలపై ఇది 70 శాతం వరకు కూడా ఉండే అవకాశం ఉందని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు.

మరోవైపు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు వెళ్లిన భారత ఉన్నతస్థాయి అధికారుల బృందం చర్చలు ముగించుకుని వెనక్కి వచ్చింది. అమెరికా కోరుతున్న వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తుల మార్కెట్ ప్రవేశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. భారత ప్రతినిధి బృందానికి ముఖ్య సంధానకర్త రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహించారు.

జులై 9లోగా సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు ఇరు దేశాల మధ్య రాజకీయ స్థాయిలో చివరి నిమిషంలో ఒప్పందం కుదరవచ్చని ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. అయితే, ఏ గడువుకూ లోబడి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని భారత వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్ ఇప్పటికే స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన తేల్చిచెప్పారు.

అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లో విస్తృత మార్కెట్ కల్పించాలన్నది ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ అంశం దేశంలోని చిన్న రైతుల జీవనోపాధితో ముడిపడి ఉండటంతో భారత్ దీనిని సున్నితమైన విషయంగా పరిగణిస్తోంది. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతయ్యే టెక్స్‌టైల్స్, లెదర్, పాదరక్షలు వంటి వాటిపై సుంకాల రాయితీలు కోరుతోంది. దీంతో జులై 9 గడువు సమీపిస్తున్న వేళ ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.


More Telugu News