ఆఫ్రికా దేశం మాలిలో ఏపీ వ్యక్తి కిడ్నాప్

  • పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
  • కిడ్నాపైన వారిలో పల్నాడు జిల్లా వాసి అమరలింగేశ్వర రావు
  • సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసి కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో జరిగిన ఉగ్రదాడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. అల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ముగ్గురు భారతీయులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఉండటమే ఇందుకు కారణం. పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వర రావు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. ఈ వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గత 15 సంవత్సరాలుగా అమరలింగేశ్వర రావు మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఉగ్రవాదులు, ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులను అపహరించుకుపోయారు. మిర్యాలగూడలో నివాసముంటున్న అమరలింగేశ్వర రావు, కేవలం రెండు నెలల క్రితమే తన భార్య రమణ, పిల్లలను హైదరాబాద్‌కు మార్చారు.

కొడుకు కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్తతో ఆయన తండ్రి కుప్పకూలిపోయారు. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా విడిపించి తీసుకురావాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. అమరలింగేశ్వర రావు భార్య, పిల్లలు హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.



More Telugu News