సుపరిపాలనలో తొలి అడుగు... కరపత్రాలతో ప్రజల్లోకి వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు

  • 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు
  • శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ముఖాముఖి
  • కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను వివరించిన మంత్రి
  • సూపర్ సిక్స్ హామీలను దాదాపుగా నెరవేర్చామని వెల్లడి
  • రాష్ట్రానికి పరిశ్రమలను తిరిగి తీసుకువస్తున్నామని స్పష్టీకరణ
 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వం చేపట్టిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలంలోని చిన్న బమ్మిడి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.

చిన్న బమ్మిడి గ్రామానికి చేరుకున్న అచ్చెన్నాయుడికి స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలోని ప్రతి ఇంటి గడప తొక్కుతూ, ప్రభుత్వ పనితీరును ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో మేలు జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వారికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం దాదాపుగా నెరవేర్చిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషితో తిరిగి తీసుకువస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.


More Telugu News