టేకాఫ్‌కు ముందు ఫైర్ అలర్ట్... స్పెయిన్‌లో విమానం రెక్కపై నుంచి దూకేసిన ప్రయాణికులు

  • స్పెయిన్‌లో టేకాఫ్ అవుతున్న విమానంలో ఫైర్ అలర్ట్
  • ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు
  • విమానం రెక్కపై నుంచి కిందకు దూకిన పలువురు ప్రయాణికులు
  • ఘటనలో 18 మందికి స్వల్ప గాయాలు
  • సాంకేతిక లోపంతోనే తప్పుడు అలర్ట్ అని తేల్చిన సంస్థ
స్పెయిన్‌లో విమానంలో గందరగోళం నెలకొనడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. టేకాఫ్ అవుతున్న విమానంలో ఫైర్ అలారం మోగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు విమానం రెక్కల మీదుగా కిందకు దూకేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

స్పెయిన్‌లోని పాల్మా డె మేయర్క్‌ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్‌కు ర్యాన్‌ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 విమానం బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఫైర్ అలారం మోగడంతో ప్రయాణికులు భయాందోళనలతో కేకలు వేశారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులను బయటకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. అయితే, కొంతమంది ప్రయాణికులు సిబ్బంది సూచనలను వినకుండా భయంతో విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకేశారు. ఈ క్రమంలో దాదాపు 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై ర్యాన్‌ఎయిర్ సంస్థ స్పందిస్తూ, సాంకేతిక లోపం కారణంగానే ఫైర్ అలారం మోగిందని, ఎలాంటి ప్రమాదం లేదని వివరణ ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా టేకాఫ్‌ను నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా టెర్మినల్‌కు తరలించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.


More Telugu News