మామిడి రైతులను దోచుకుంటుంది వైసీపీ నేతలే .. వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి

  • పెద్దిరెడ్డి కుటుంబ కంపెనీ మామిడి రూ.3కే కొనుగోలు చేస్తోందన్న మర్రెడ్డి
  • ప్రభుత్వంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న మర్రెడ్డి 
  • ప్రభుత్వం రాయితీ అందిస్తూ కిలో మామిడి ధరను రూ.12గా నిర్ధారించిందన్న మర్రెడ్డి
వైసీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి మామిడి రైతులను దోచుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మామిడి పంటను కొనడం లేదంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాజమాన్యంలోని పీఎల్ఆర్ ఫుడ్స్ ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే తక్కువగా కిలో రూ.3కే ఎందుకు కొంటుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అలానే వైసీపీ నాయకులకు చెందిన సీజీఆర్ ఫుడ్స్, టాసా, సన్నిధి వంటి కంపెనీలు రైతుల నుంచి కిలో మామిడిని రూ.3కే కొంటున్నాయని ఆయన అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ ఎగుమతులు లేక మిగిలిపోయిందని, దీంతో ధరలు తగ్గాయన్నారు.

అయినప్పటికీ ప్రభుత్వం రాయితీ అందిస్తూ కిలో మామిడి ధరను రూ.12గా నిర్ధారించిందని ఆయన అన్నారు. అంతే కాకుండా మామిడి పల్ప్‌పై 12 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించాలని, పండ్ల రసాల ఆధారిత జ్యూస్‌లపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖలు రాసిందని మర్రెడ్డి తెలిపారు. 


More Telugu News