148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డు

  • టెస్ట్ క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ చారిత్రక ఘనత
  • ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, 150+ స్కోరు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు
  • తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు బాదిన గిల్‌
  • ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం
టెస్ట్ క్రికెట్ 148 ఏళ్ల చరిత్రలో ఏ బ్యాటర్‌కూ సాధ్యంకాని అరుదైన ఘనతను భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సాధించాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, 150కి పైగా పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగుల భారీ స్కోరు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగించి 161 పరుగులు సాధించాడు. దీంతో ఒకే టెస్టులో ఏకంగా 430 పరుగులు చేసి, ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 

కాగా, భారత జట్టు 427/6 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు వెస్టిండీస్ జట్టు 2003లో ఆస్ట్రేలియాపై 418 పరుగులు ఛేదించడమే అత్యధికం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమనే చెప్పాలి.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు గట్టి షాకిచ్చారు. మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తమ పదునైన బంతులతో ఇంగ్లీష్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. జాక్ క్రాలీ (0), బెన్ డకెట్ (25), జో రూట్ (6) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. విజయానికి ఆ జట్టు ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ గెలుపున‌కు మరో 7 వికెట్లు అవసరం.


More Telugu News